హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ : దేశమంతా 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా ముందుకెళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ఫార్మ్ నెట్వర్క్ ద్వారా స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలు, సంయుక్త ఆవిషరణలకు మరింత ప్రోత్సాహం లభించనున్నదని తెలిపారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సరిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం , బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్, సీవోఈ-ఎఫ్పీవో బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పీజేటీఏయూ ఇండియా-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ మాట్లాడుతూ రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదురొనేందుకు భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ఎంతో కీలకమని వెల్లడించారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ ప్రతినిధి డాక్టర్ విశాల్, సీఈవో రష్మీ పింపాలే, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ బలరాం, ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ బెంగళూరు అనంత రామన్, బెంగళూరు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ సీఈవో దీప్తి సునీల్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.