హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇక వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల కోసం పోటీపడొచ్చ’ని ఆశపడుతున్నారా? అ యితే మీ ఆశలు నెరవేర్చుకునేందుకు మే దా కా ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ వద్ద ఖాళీ పోస్టుల వివరాల్లేవు. ప్రభుత్వం నుం చి కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇం డెంట్లు టీజీపీఎస్సీకి చేరలేదు. ఒక్కటంటే ఒక్క ఇండెంట్ కూడా టీజీపీఎస్సీకి అందలేదు. మొత్తంగా ఉత్తచేతులతో నోటిఫికేషన్లు ఇవ్వలేని స్థితిలో టీజీపీఎస్సీ నడుస్తున్నది. ఆ లోపు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసే పనిలో టీజీపీఎస్సీ నిమగ్నమైంది. పెండింగ్లో పడిన నోటిఫికేషన్లను క్రమంగా క్లియర్ చేసే పనిలో పడింది.
మార్చి 31లోగా ఖాళీల వివరాలివ్వండి..
నోటిఫికేషన్లు ఇచ్చేందుకు తమ వద్ద ఖాళీల వివరాలు లేకపోవడంతో టీజీపీస్సీయే చొరవ ప్రదర్శిస్తున్నది. ఈ మార్చి 31లోగా శాఖల వారీగా భర్తీచేసే ఖాళీల వివరాలను సమర్పించాలని త్వరలోనే ప్రభుత్వానికి లేఖను రాయనున్నది. ఏడాది కాలంలో భర్తీ చేసే మొత్తం పోస్టుల వివరాలను తమకు అందజేయాలని కోరనున్నది. మార్చిలోగా ఖాళీల వివరాలు ఇవ్వాలంటే ముందుగా ప్రభుత్వం శాఖల వారీగా ఖాళీలను తేల్చాలి. అవసరమైన మేరకు కొత్త పోస్టులను మంజూ రు చేయాలి. ఈ ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలపాలి. ఆయా ఇండెంట్లు టీజీపీఎస్సీకి చేరాలి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. సర్కారు నుంచి వివరాలన్నీ మార్చి 31లోగా ప్రభుత్వానికి చేరితే ఏప్రిల్లో కసరత్తు చేసి మే నెలలో లేదా ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచనలో టీజీపీస్సీ ఉన్నది. అంతదాకా నిరుద్యోగులు నిరీక్షించాల్సిందే.
ఏ ఏడాది పోస్టులు ఆ ఏడాదే..
ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడంపై టీజీపీఎస్సీ దృష్టిసారించింది. ఏ ఏడాది జారీచేసిన నోటిఫికేషన్లను ఆ ఏడాదే పూర్తిచేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నది. ఏప్రిల్లో కసరత్తును ప్రారంభించి మరుసటి సంవత్సరం మార్చి 31వ తేదీలోగా నియామకాలను భర్తీ చేయాలని కమిషన్ భావిస్తున్నది. ఎన్ని పోస్టులున్నాయన్న దాంతో సంబంధం లేకుండా 1, 2 పోస్టులున్నా నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నది.