హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌తో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. క్లాసులు బహిష్కరించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ సమ్మెను ఉధృతం చేస్తున్నట్టు వారు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బుధవారం పోలీసుల ఆంక్షల నడుమ ఆర్ట్స్ కాలేజీ నుంచి పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు అదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో బోధన నిలిచిపోయిందని, విద్యావ్యవస్థను కాపాడాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో యూనివర్సిటీల్లో హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండాపోయిందని మండిపడ్డారు. జీవోలు, పోలీసులతో పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్ పరుశురామ్, డాక్టర్ బైరి నిరంజన్, కుమార్, రఘువీర్‌రెడ్డి, ఉపేందర్, సురేశ్‌నాయక్, శ్రీశైలం, భూమయ్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.