హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు గిరిజన ఆశ్రమ పాఠశాల్లోని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2015 నుంచి ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నామని, అయినా తమకు రూ.10,470 వేతనాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని సంఘం నేతలు వాపోయారు. పెరిగిన ఖర్చులతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ఇదే విషయమై అనేకసార్లు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని, వేతనాలు పెంచేవరకూ ఆందోళనేనన్నారు.