హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల కోసం పోరాడుతున్న ప్రైవేట్ కాలేజీల (Private Colleges) యాజమాన్యాలు సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేసేందుకు రెడీ అయ్యాయి. ఏకంగా పరీక్షలనూ బహిష్కరించాలని నిర్ణయించాయి. ‘కాలేజీల తాళాలు తియ్యం.. క్లాసులు చెప్పం.. పరీక్షలు జరుపబోం’ అని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. దీంతో దాదాపు 2,500 పైచిలుకు కాలేజీల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ఇంటర్నల్, సెమిస్టర్ పరీక్షలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కాలేజీల నిరవధిక బంద్‌కు, చలో హైదరాబాద్ కార్యక్రమాలకు ఫెడరేషన్స్ ఆఫ్ అసొసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి విద్యార్థుల చదువులకు బ్రేక్‌లు పడనున్నాయి. గత సెప్టెంబర్ 15 నుంచి ఫతి ఒక దఫా కాలేజీల బంద్ నిర్వహించింది. రూ.1,200 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీతో రెండు రోజుల అనంతరం బంద్‌ను విరమించింది. రూ.300 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.. మిగతా వాయిదా బకాయిలను చెల్లించడమే లేదు. దీంతో సర్కారు మోసం చేసిందన కాలేజీల యాజమాన్యాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలలకు కాంగ్రెస్ సర్కారు రూ.10 వేల కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉన్నది. దీనిలో రూ.5 వేల కోట్లను ఈ విద్యా సంవత్సరంలోగా విడుదల చేయాలని, అప్పటివరకూ తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కాలేజీ యాజమన్యాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో ఫీజు బకాయిల కోసం పోరాడుతున్న యాజమాన్యాలను కట్టడి చేసేందుకు సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నది. దీంతో ఇంతకాలం టోకెన్లు విడుదలైన రూ.1,207 కోట్లను విడుదల చేయాలని కోరగా, తాజాగా సర్కార్ విజిలెన్స్ దాడులకు ఉత్తర్వులివ్వడంతో.. ఇప్పుడు సగం బకాయిలను ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ పోరులోకి కాలేజీ యాజమాన్యాలతోపాటు విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. బంద్‌కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఈ మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నది. ఈ నెల 4 వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఎస్ఎఫ్ఐ ప్రకటించింది. ఈ బంద్‌కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి వెల్లడించారు. బకాయిల విడుదల కోసం ఏబీవీపీ రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు.
విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఫీజుల చెల్లింపులపై లేదని మండిపడ్డారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఆధారపడి చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
సమస్యలపై విద్యార్థి సంఘాలు బంద్‌లకు పిలుపునివ్వడం అప్పుడప్పుడూ జరుగుతుంది. ఇదే డిమాండ్ మేరకు విద్యార్థి సంఘాలు కూడా పోరాడటంతోపాటు విద్యాసంస్థల బంద్ కూడా చేపట్టాయి. కానీ, కాంగ్రెస్ సర్కారు వైఖరిని నిరసిస్తూ మొదటిసారి అన్ని కాలేజీల యాజమాన్యాలు మూకుమ్మడి బంద్ సిద్ధపడటం అరుదైన సందర్భం. ఇది కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనమని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని విస్మయం వ్యక్తంచేస్తున్నారు.