హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్‌తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పాయి. ప్రభుత్వం రూ.2వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం స్పష్టంచేసింది. కాలేజీలు బంద్‌లో పాల్గొనాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉన్నత విద్యామండలి, వర్సిటీల అధికారులను కలసి బంద్‌కు వెళ్తున్నట్టు తెలిపారు. ఇక మాటలు వినే పరిస్థితుల్లో లేమని, బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టంచేశారు.
సీఎం సమయమివ్వలేదు
తెలంగాణలో ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురైందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రులు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కనీసం తమకు సమయమివ్వలేదని వాపోయారు. 90శాతం కాలేజీలు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని, అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దసరా సెలవుల తర్వాత బంద్ పాటించామని, వారంలో నిధులు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సందిగ్ధంలో సెమిస్టర్ పరీక్షలు!
కాలేజీల బంద్ ప్రభావం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలపై పడనుంది. డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు ఈ వారంలో, ఓయూ పరీక్షలు నేటి నుంచి జరగాల్సి ఉంది. 21 నుంచి మహత్మాగాంధీ, 26 నుంచి కాకతీయ, పాలమూరు వర్సిటీల పరీక్షలు ప్రారంభం కావాలి. ఈ నెలలోనే తెలంగాణ, శాతవాహన వర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి. నెలాఖరు నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ పరీక్షలు జరగకపోతే విద్యాసంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపనుంది.