Godavari River | భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తున్నది. భారీ వర్షాలతో నదిలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో వర్షానికి సీతారామస్వామి ఆలయ పరిసరాల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. మరో వైపు అన్నదాన సత్రం వద్దకు నీరు చేరింది. దీంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. ఇవాళ ఉదయం 41 అడుగులు దాటిన నీటిమట్టం.. మధ్యాహ్నం వరకు 43 అడుగులను దాటింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద జారీ చేస్తారు. వరదల నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక అధికారులను అప్రమత్తం చేశారు. 24గంటలు పని చేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరి ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.