హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రం లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది అత్యధిక చేపల ఉత్పత్తిని సాధిద్దామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మత్స్య సహకార సంఘాలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్యభవన్ నుంచి బుధవారం వైస్ చైర్మన్ దీటి మల్లయ్య గంగపుత్రతో కలిసి 33 జిల్లాల మత్స్య సహకార సం ఘాల బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భం గా రవీందర్ మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ 2016లో ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం మెరుగైన పద్ధతిలో ఫలితాలను సాధిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. చేప పిల్లల సైజు, సంఖ్య, నాణ్యత సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, కాంట్రాక్టర్లు ఎలాం టి అవకతవకలకు పాల్పడినా తిరసరించే అధికారం మత్స్య సహకార సంఘాలకు ఉంటుందని గుర్తు చేశారు.