హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూగర్భ జలాలు నిరుటి కంటే గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 5.78 మీటర్లుగా ఉన్నది. ఇది నిరుడు ఆగస్టుతో పోలిస్తే 1.06 మీటర్లు, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే 4.29 మీటర్లు అధికం. రాష్ట్రంలో 1,771 పైజోమీటర్ల ద్వారా పర్యవేక్షించిన డాటా ప్రకారం.. 23 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు పెరిగాయి. గరిష్ఠంగా నాగర్కర్నూల్ జిల్లాలో 5 మీటర్లు, కనిష్ఠంగా నిజామాబాద్ జిల్లాలో 0.18 మీటర్ల పెరుగుదల నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో అతితకువగా 1.71 మీటర్ల లోతులో, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 11.38 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉన్నది. సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుంచి ఆగస్టు వరకు 574 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ, ఈసారి 721 మి.మీ వర్షం కురిసింది. 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్-ఆగస్టు మధ్య 26% అధిక వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు పెరిగాయని, ఇది వ్యవసాయానికి శుభపరిణామమని భూగర్భ జల శాఖ డైరెక్టర్ కే లక్ష్మ తెలిపారు.