ప్రభుత్వం మారిన వెంటనే లంచాధికారులు ప్రజలను పీడించేందుకు కోరలు చాచారు. నగదు కోసం పౌరులను జలగల్లా పట్టి పీడించారు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, పాస్ బుక్ చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా.. లంచం లేనిదే పనులు జరగలేదు. దీంతో ఎందరో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఒక్కో అవినీతి అధికారికి ఒక్కో రకమైన ట్రాప్ వేసిన ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనంతగా అధికారుల అవినీతి శాతం 65.21గా నమోదైంది.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) 152 కేసులు నమోదు చేసి, 223 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించారు. 129 ట్రాప్ కేసుల్లోనే 200 మంది నిందితులను (159 మంది ప్రభుత్వ ఉద్యోగుల)ను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. వీటిలోపాటు 11 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు నమోదవగా, 12 క్రిమినల్ మిస్ కండక్ట్ కేసుల్లో 18 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. అవినీతి ఆరోపణలపై 11 కేసుల్లో ఏసీబీ సాధారణ విచారణ జరిపిందని, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 29 ఆకస్మిక తనిఖీలు నిర్వహించిందని తేల్చిచెప్పారు.
105 కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశామని, 16 కేసుల్లో అధికారులకు శిక్షలు విధించబడ్డాయని, మొత్తంగా నేరారోపణ రేటు 64 శాతం మేర పెరిగిందని విజయ్‌కుమార్ వివరించారు. ఈసారి కూడా 26 పాత కేసులను విచారణకు తీసుకున్నామని చెప్పారు. 2024లో నమోదు చేసిన 129 ట్రాప్ కేసుల్లో మొత్తం రూ.82,78,000 నగదును స్వాధీనం చేసుకున్నామని, దాని నుంచి రూ.64,80,000ను ఫిర్యాదుదారులకు తిరిగి చెల్లించినట్టు వివరించారు. 11 కేసుల్లో రూ.97,42,67,000 విలువైన అక్రమాస్తులను నిందితుల నుంచి అటాచ్ చేసినట్టు విజయ్‌కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది 29 మంది పోలీస్ అధికారులు, ఒక పీపీ, ఇద్దరు ఇంజనీర్లతో సహా 32 మంది అధికారులకు ప్రైమరీ ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. డ్రాఫ్టింగ్, ఆర్థిక లావాదేవీల ట్రేసింగ్‌లో దర్యాప్తు, ట్రాప్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఈ నెల 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచాల కోసం ప్రజలను పీడిస్తే తక్షణం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని విజయ్‌కుమార్ కోరారు.