హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మోపింది. రాష్ట్ర రవాణాశాఖ వాహనదారులపై సర్వీ సు చార్జీలను భారీగా పెంచింది.
ట్యాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన చార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త రేట్ల ప్రకారం.. లైసెన్స్ సర్వీస్ చార్జీని రూ.200కు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ చార్జీని రూ.300కు పెంచారు. నాన్ ట్రాన్‌పోర్ట్ లైసెన్స్‌కు కొత్తగా రూ.400 వసూలు చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. టూవీలర్ల రిజిస్ట్రేషన్‌లో కొనుగోలు ధరపై రూ.0.5శాతం అదనపు చార్జి వసూలు చేయనుండగా, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 0.1శాతం పెంపు అమలులోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250కు చేరగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500కు పెరిగింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ రేట్లు కూడా సవరించారు.
త్రీవీలర్లకు రూ.200, మిగతా వాహనాలకు రూ.300 వసూలు చేయనున్నారు. పర్మిట్ సర్టిఫికెట్ ఫీజులు పెరిగాయి. త్రీవీలర్లకు రూ.200, మిగతా వాహనాలకు రూ.300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో రవాణాశాఖలో సేవలు పొందే వారికి అదనపు వ్యయం తప్పదని వినియోగదాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.