హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లులను నెలకు రూ. 700 కోట్ల నుంచి రూ. 1,500కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. పెన్షనర్ల బకాయిలను ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేసింది. టీజీవో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం ములుగులో నిర్వహించారు. ఒక డీఏ విడుదల చేసినందుకు, టీజీవో కేంద్ర సంఘం, జిల్లా సంఘం భవనాలకు స్థలం, భవన నిర్మాణాలకు 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తక్షణమే ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విధివిధానాలను ప్రకటించి అమలుచేయాలని సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ కోరారు. ఉద్యోగులకు బకాయిపడ్డ నాలుగు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.