కిలో వంటనూనె ధర రూ.15 నుంచి రూ.20వరకు పెరిగింది. ఇప్పటికే ఓ వైపు కూరగాయల ధరలు మండిపోతుండటం.. మరోవైపు వంటనూనెల ధరలు భగ్గుమంటుండటంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేసింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకొనేందకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగా యి. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై సుంకం 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరిగింది.
అన్ని నూనెలూ భారమే
కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒకసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. పామాయిల్ ధర రూ.100 నుంచి రూ.115-120, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165-170కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ రూ.110 నుంచి రూ.120-125కి పెంచి అమ్ముతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. మరికొందరు పాత స్టాక్‌ను కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే లీటరు నూనె ధర రూ.20 పెరుగడంతో వినియోగదారుడు నోరెళ్లబెడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
గత నెలలో 16 శాతం తగ్గిన దిగుమతులు: ఎస్ఈఏ
దేశంలో 2023 ఆగస్టుతో పోలిస్తే గత నెలలో వంట నూనె దిగుమతులు 16 శాతం తగ్గినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) నివేదిక వెల్లడించింది. నిరుడు ఆగస్టులో 18.66 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంటే.. గతనెలలో 15.63 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది. దిగుమతుల తగ్గుదల ఉన్నప్పటికీ 2023-24లో భారత్ వంట నూనె దిగుమతులు 160 నుంచి 165 లక్షల మెట్రిక్ టన్నుల మధ్య ఉంటాయని ఎస్ఈఏ అంచనా వేస్తున్నది. ఇది గత ఏడాది సంఖ్యలకు దగ్గరగా ఉన్నది.