Delimitation | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 2026 జనాభా గణన తర్వాతే ఏపీ, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపునకు సంబధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరై వాదనలు వినిపించారు. జనగణన వరకు ఎదురుచూడాల్సిందేనని తెలిపారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడం వల్లే అక్కడ సీట్ల పెంపు జరిపినట్టు వెల్లడించారు.
తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి 2022 జూన్ 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ, ఏపీని మినహాయించి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు మాత్రమే డీలిమిటేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని 2022లో ప్రతివాదులైన కేంద్రం, ఈసీ, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్సింగ్తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను ముగించింది. సుదీర్ఘ వాదనల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది.