Ration Cards | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేతో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌కార్డుల జారీలో కొర్రీలు, కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అ నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండు రోజుల క్రితం విధివిధానాలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై ప్రజలు, రాజకీయవర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్‌కార్డులకు దరఖాస్తు విధా నం తీసేయడం, కులగణన వివరాలకు లింక్ పెట్టడం అనుమానాలకు తావిస్తున్నది.
ప్రభుత్వానికి రేషన్‌కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉందా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కులగణన పూర్తి కాలేదని ప్రభుత్వమే చెబుతున్నది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులగణన 96 శాతం పూర్తయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ లెక్కల ప్రకారం 70-80 శాతమే సర్వే పూర్తయినట్టు తెలుస్తున్నది. పూర్తికాని సర్వేతో రేషన్‌కార్డులకు లింక్ పెట్టడమేంటని, దాని ఆధారంగా లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కులగణన సర్వే అస్తవ్యస్తంగా సాగిందని, కులగణనతో రేషన్‌కార్డుకు లింకా? అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించారని విమర్శలున్నాయి. ప్రజల నుంచి సేకరించిన వివరాలతో కూడిన ఫారాలు రోడ్లపై దర్శనమిచ్చాయి. కులగణనలో పాల్గొనాలని, వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దలు మాత్రం సర్వేకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు కూడా సర్వేలో పాల్గొనలేదని ప్రచారం జరిగింది. ఈ సర్వేకు ప్రామాణికత ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కులగణన సర్వేలో చాలా మంది ప్రజలు పాల్గొనలేదు. ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వివరాలను ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం మాత్రం కులగణన సర్వేతో రేషన్‌కార్డులకు లింక్ పెట్టడమేంటని, రేషన్‌కార్డులకు అర్హతలున్నప్పటికీ సర్వేలో పాల్గొనని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కొత్త రేషన్‌కార్డుల జారీకి ఇప్పటివరకు అనుసరించిన దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి కూడా రేషన్‌కార్డులు వచ్చే అవకాశం పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయడమేంటని పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ఒకవేళ సర్వేలో తప్పులు దొర్లితే అర్హులైనప్పటికీ రేషన్‌కార్డు మంజూరయ్యే అవకాశం పోతుంది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్‌కార్డుల జారీ సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.