హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): న్యాయవ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. చేతికి ఎముకలేని తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రేడ్‌మార్క్ అని ప్రశంసించారు. దేశంలో చాలాచోట్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతుండగా, సీఎం కేసీఆర్ మాత్రం న్యాయవ్యవస్థలో నాలుగు వేల పై చిలుకు ఉద్యోగాలను సృష్టించడం అభినందనీయమని మెచ్చుకొన్నారు. ఇందుకు న్యాయవ్యవస్థ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల రెండు రోజుల సదస్సును శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ రమణ ప్రసంగిస్తూ.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తరుణంలో న్యాయవ్యవస్థ అగ్రగామిగా ఉండాలన్న తపన కేసీఆర్‌లో కనిపిస్తున్నదని కొనియాడారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను నెలకొల్పాలన్న తన కలను కేసీఆర్ సాకా రం చేశారని గుర్తుచేశారు. అత్యంత విలువైన భూమి తోపాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరుచేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంద న్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిషరించడం వల్ల కొత్త కంపెనీల ఏర్పాటుకు ఆసా రం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ తరహా లో తమ రాష్ట్రంలో కూడా ఐఏఎంసీని ఏర్పాటుచేయాలని మహారాష్ట్ర వంటి చోట్ల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, అయితే, హైదరాబాద్ కేం ద్రం లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించిన త ర్వాత ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్పినట్టు వివరించారు.
సమానత్వం అంటే పురుషులతో సమానంగా స్త్రీల కు అవకాశం ఇవ్వడం మాత్రమే కాదని, అన్ని కులాలు, వర్గాలకు కూడా సమన్యాయం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల భర్తీలో పారదర్శకత, సామాజిక న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తుల పోస్టుల భర్తీతోనే సత్వర న్యాయం సాధ్యమని స్పష్టంచేశారు. తెలంగాణ హైకోర్టులో ఖాళీగా ఉన్న 13 మంది న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచినట్టు తెలిపారు. ఇటీవల 17 మందిని న్యాయమూర్తులుగా నియమించామని గుర్తుచేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న మరో రెండు నియామకాల పూర్తికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
న్యాయాధికారులంతా చిత్తశుద్ధితో కేసుల సత్వర పరిషారానికి కృషి చేయాలని జస్టిస్ రమణ ఉద్బోధించారు. న్యాయాధికారులు త్వరలోనే వేతన సంఘం గురించి శుభవార్త వింటారని సీజేఐ ప్రకటించగానే సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి. చట్ట సవరణలు, కొత్త చట్టాలు, సాంకేతికత వినియోగం పెరిగిన నేపథ్యంలో నూతన తరహా కేసుల నమోదులపై న్యాయాధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ముందడుగు వేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కోర్టులు సమర్థంగా పనిచేస్తూ, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరిగేలా కృషి చేయాలని ఉద్బోధించారు. అప్పీళ్లు దాఖలు చేసే న్యాయవ్యవస్థలో మనం ఉన్నామని, దీనివల్ల కేసుల విచారణ జాప్యం అవుతున్నదన్న భావన ఏర్పడిన తరుణంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్ విధానాలను న్యాయాధికారులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తుల గృహ సముదాయాల ఫలకాన్ని, హైకోర్టు ఆవరణలో సెంట్రల్ రికార్డు బ్లాక్ నిర్మాణాల ఫలకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఆవిషరించారు.