జనగామ రూరల్, జూన్ 22 : అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్రమనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన రైతు చాపల భాస్కర్(41) తనకున్న ఎకరం సాగు చేసుకుంటున్నాడు. పంట పెట్టుబడి, ఇద్దరు కూతుళ్ల పెండ్లికి రూ.8 లక్షలు అప్పులయ్యాయి.
వాటిని తీర్చడానికి రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. అప్పు ఇచ్చినవారు డబ్బులు చెల్లించాలని ఇంటికి రావడంతో మనస్తాపంతో భాస్కర్ ఆదివారం బావి వద్ద ఉరేసుకున్నాడు. హనుమకొండ జిల్లా గూడూరుకు చెందిన రైతు కుమ్మరి ప్రతాప్ (42) 2.20 ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. రెండేండ్లుగా దిగుబడులు రాక రూ.12 లక్షలు అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక బెంగపెట్టుకున్నాడు. ఈ నెల 21న పొలం వద్ద గడ్డి మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.