చేవెళ్ల రూరల్, జూలై 28 : పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు, తెలంగాణ ఆదిలాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మించి ఈ నెల 25న చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ ఫారెస్ట్ (కంచె)కు రప్పించారు. బాధితుడు రూ.21 లక్షలు తీసుకొని రాగా పథకం ప్రకారం పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు, అగరుబత్తీలు పెట్టారు. ఫోనులు స్విచ్ ఆఫ్ చేయించి, పూజ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు, కాంతులు వస్తాయని, దానికి తట్టుకోవడం సాధ్యం కాదని చెప్పి, బాధితుడిని కారులో కూర్చోబెట్టి, డబ్బు తీసుకుని వారు వేరే కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగరు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.18 లక్షల నగదు, గ్రాము బంగారు కాయిన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనో రంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్లతో కూడిన 54 ఐదు వందల రూపాయల నకిలీ నోట్ల కట్టలు, వంద రూపాయల ఫేక్ నోట్ల కట్టలు ఎనిమిదింటిని స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్వర్ దత్త వాంఖేడే, ప్రకాశ్ మరోత్రావు మాధవి (మహారాష్ట్ర),సింగారె ధర్మేందర్ (ఆదిలాబాద్), ములుకుంట్ల సంజీవ్‌కుమార్ (పెద్దపల్లి), కొమండ్ల శ్రీనివాస్ (మంచిర్యాల్), దేవ్‌రావ్ షిండే, ప్రశాంత్ పాటిల్ (మహారాష్ట్ర పరారీలో ఉన్నారు) నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఈ ముఠా పైసల వర్షం పేరిట ఒక డెమో చేసి ప్రజలను నమ్మించి, పూలమధ్యలో అసలైన నోట్లను పెట్టి పైసల వర్షం కురిపించినట్టు చూపించిన తర్వాత ఫేక్ నోట్లను పెట్టి అసలైన నోట్లతో ఉడాయిస్తారని తెలిపారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.