మణుగూరు టౌన్, సెప్టెంబర్ 26 : స్టేషన్ బెయిల్ మంజూరు కోసం రూ.40 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి బాధితుడి నుంచి రూ.40 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఈ నెల 19న ఫిర్యాదు చేశాడు. వారు పన్నిన పథకం ప్రకారం.. సదరు బాధితుడు లంచం ఇవ్వగా అనుమానం వచ్చిన ఎస్సై ఆ డబ్బులు తీసుకోలేదు. ఎస్సై లంచం తీసుకోకపోయినా ఆడియో రికార్డింగ్, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు.