గజ్వేల్, జనవరి 9: విద్యార్థులు తెల్లవారుజామున స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చినందుకు వారిపై పీడీ(ఫిజికల్ డైరెక్టర్) తన ప్రతాపాన్ని చూపించాడు. 30 మంది విద్యార్థులకు వరుస క్రమంలో నిలబెట్టి కర్రతో చితకబాదాడు. ముగ్గురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలవడంతో సిద్దిపేటలోని దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థులను వాచ్మన్ ఉదయం 5 గంటలకు నిద్రలేపాల్సి ఉండగా ఆలస్యంగా 5.40 గంటలకు లేపడంతో చలి తీవ్రంగా ఉండడం కారణంగా స్టడీ అవర్కు పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు ఆలస్యం అయిందంటూ విద్యార్థులపై పీడీ వాసు ఆగ్రహం వ్యక్తం చేసి కర్రతో బాదాడు.
దీంతో పలువురికి వాతలు తేలాయి.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలవడంతో ఇబ్బంది పడ్డారు. విద్యార్థులను సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. పాఠశాలకు వచ్చిన తరువాత విద్యార్థులకు కూర్చోవడం ఇబ్బందికరంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇ చ్చారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని వారి పిల్లల శరీరంపై ఉన్న గా యాలను చూసి చలించిపోయారు. గతం లో కూడా పీడీ వాసు విద్యార్థులను ఇలాగే చితకబాదితే తల్లిదండ్రులు గురుకులాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జడ్జి స్వాతిరెడ్డి గురువారం పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.