చర్లపల్లి, సెప్టెంబర్ 11 : నర్సింగ్ కోర్సు పూర్తయినా.. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతోపాటు ఆరుగురు విద్యార్థినులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి కుషాయిగూడలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలోని దేవ్స్ కాలేజీ ఆఫ్ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు కొంతకాలంగా సర్టిఫికెట్ల కోసం అందోళన చేపడుతున్నారు.
స్కాలర్షిప్ను కాలేజీ ఫీజు కింద జమ చేసుకుంటామని చెప్పిన దేవ్స్ కాలేజీ యాజమాన్యం తమ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని పలువురు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకవెళ్లినా పట్టించుకోకపోవడంతో తాము ఆత్యహత్యాయత్నానికి పాల్పడటానికి సిద్ధమయ్యామని విద్యార్థినులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు సత్య ప్రసాద్, సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు.