Lakshmi Barrage | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్‌లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట్టు కనిపించింది. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన ఇంజినీర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వారు తనిఖీ కోసం వెళ్లడంతో ఈ సంగతిని గుర్తించారు. చప్పుడు ఎందుకొచ్చింది? పిల్లర్ ఎందుకు కుంగింది? ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా? అని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరి నదిపై ఈ బరాజ్ ఉంది. 1,632 మీటర్ల పొడవైన ఈ బరాజ్‌లో మొత్తం 87 పిల్లర్లు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న, అటు వైపు నుంచి 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం వచ్చినట్టు చెప్తున్నారు.
పెద్ద శబ్దం రావడంతో, ఏం జరిగిందోనన్న భయంతో అధికారులు కొద్దిసేపు వేచి చూశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి చూడగా.. ఆరో బ్లాకులోని 20వ పిల్లర్ స్వల్పంగా కుంగినట్టు గుర్తించారు. కానీ చీకటిగా ఉండడం, బరాజ్‌లో నీళ్లు ఉండడంతో అసలేం ఏం జరిగింది? పరిసరాలు ఎలా ఉన్నాయనేది ఇంజినీర్లు స్పష్టంగా గుర్తించలేకపోయారు. ప్రాథమికంగా చూసిన మేరకు మాత్రం పిల్లర్ స్వల్పంగా కుంగిపోయినట్టు కనిపించినందున, ముందు జాగ్రత్తచర్యగా వెంటనే తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకల్ని నిలిపివేశారు. బరాజ్‌లో దాదాపు 10 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. బరాజ్‌పై లోడ్ తగ్గించడం కోసం గేట్లు ఎత్తి, నీటిని కిందకు వదులుతున్నారు.
బరాజ్‌పై ఉన్న రోడ్డు అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇది జరిగిందా? లేక బేరింగ్స్‌లో సమస్య వల్లనా? లేక ఇంకేదైనా జరిగిందా అన్నది తెలియడం లేదు. నిర్మాణ రంగంలో అంతర్జాతీయ ప్రఖ్యాతి సాధించిన, ప్రాజెక్టుల నిర్మాణాల్లో పేరెన్నికగన్న ఎల్అండ్టీ సంస్థ ఈ బరాజ్‌ను నిర్మించింది. 16.17 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యంతో 85 గేట్లు, 87 పిల్లర్లు ఉన్న ఈ బరాజ్ 2019లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి గత ఐదు సీజన్ల (వానకాలపు వరదలు)లోనూ గోదావరిలో వచ్చిన భారీ వరదలను ఈ బరాజ్ తట్టుకుని నిలబడింది. ముఖ్యంగా గత ఏడాది (2022) వానాకాలంలో గోదావరి చరిత్రలోనే అతి ఎక్కువగా, 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ లక్ష్మీ బరాజ్ తట్టుకొని నిలబడింది. ప్రస్తుతం గోదావరిలో భారీ వరద కూడా లేదు. కేవలం 14,930 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదవుతున్నది. ఇలాంటప్పుడు మామూలుగా పిల్లర్ కుంగిపోవడానికి ఆస్కారమే లేదని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు.
లక్ష్మీబరాజ్ ఘటనపై ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు స్పందించారు. పెద్ద చప్పుడు వచ్చిన తర్వాత పిల్లర్ కొంత కుంగినట్టు కనిపించిందని ఆయన చెప్పారు. అయితే ఇందుకు అసలు కారణం ఏమిటనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. తెల్లారిన తర్వాత సమగ్రంగా పరిశీలిస్తేగానీ అసలు ఏం జరిగిందనే దానిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేమని వివరించారు. సమస్య పిల్లర్లకు సంబంధించినదా? లేక బేరింగులకు సంబంధించినదా? లేక కుట్రకోణం ఏమైనా ఉన్నదా? విద్రోహ చర్య ఏమైనా జరిగిందా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
ఇది అంతర్రాష్ట్ర బరాజ్ అయినందున జరిగిన సంఘటనపై ఇటు తెలంగాణలోని మహదేవపూర్, అటు మహారాష్ట్రలోని సిరొంచ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. బరాజ్‌ను ప్రతిష్ఠాత్మక ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించిందని, అయిదేండ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆ ఏజెన్సీదేనని వివరించారు. అందువల్ల బరాజ్‌లో ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కంపెనీపైనే ఉంటుందని స్పష్టంచేశారు. దీనివల్ల ప్రభుత్వంపై నయాపైసా కూడా అదనపు భారం పడబోదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఎల్అండ్టీ ఏజెన్సీకి తెలియజేశామని, వాళ్ల సీనియర్ సీజీఎం సైట్‌కు వస్తున్నారని చెప్పారు.
ఆదివారం ఉదయం వరకు ఎల్అండ్టీ హయ్యర్ ఆఫీసర్ వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని ఏజెన్సీవారు చెప్పారని అన్నారు. దీనికి వారంటీ పీరియడ్ ఉందని, గోదావరి నదిపై కట్టే బరాజ్ కాబట్టి అగ్రిమెంట్ చేసేటప్పుడే అన్ని సేఫ్టీలతోపాటు వారంటీ పీరియడ్ ఉండేట్టు చూసుకున్నామని చెప్పారు. జరిగిన డ్యామేజీ కూడా అతిచిన్నదే అని అనుకొంటున్నట్టు తెలిపారు. ఈఈని అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించామని, టెక్నికల్ సిబ్బందికి తగిన సూచనలు జారీచేసినట్టు చెప్పారు. ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బరాజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎల్అండ్టీ కంపెనీ వారు సిద్ధంగా ఉన్నారని, అది చాలా పెద్ద కంపెనీ అని తెలిపారు. ఇలాంటివాటిలో వారికి చాలా అనుభవం ఉన్నదని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ఏజెన్సీతో త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, బరాజ్‌ను నీటి నిల్వకు సిద్ధంగా చేసి రాకపోకల్ని పునరుద్ధరిస్తామని వెంకటేశ్వర్లు వివరించారు.