హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హెచ్ఐసీసీలో అట్టహాసంగా ప్రారంభమైంది. వేడుకల ఆద్యంతం అంబరాన్ని అంటాయి. వజ్రోత్సవ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన కొనసాగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఉదయం 11.35 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం వేదికపై ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మాగాంధీ, భారతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేడుకల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఆయా కార్యక్రమాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కోరారు.
జాతీయ స్ఫూర్తి నింపేలా..
వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని తొలుత ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి. జాతీయస్ఫూర్తిని నింపేలా రూపకల్పన చేసిన ప్రదర్శనలు ఆద్యంతం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశాయి. భక్త రామదాసు సంగీత, నృత్య కళాశాల బృందం ఆధ్వర్యంలో కొనసాగిన దేశభక్తి గీతాల ఆలాపణ వీనుల విందుగా సాగింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకురార్పణ జరిగిన నాటి నుంచి ఆగస్టు 15 వరకు జరిగిన కీలకఘట్టాలను ఆవిష్కరిస్తూ వేసిన శాండ్ ఆర్ట్ విశేషంగా ఆకర్షించింది. డాక్టర్ పుంజాల అలేఖ్య బృందం ప్రదర్శించిన ఝన్సీ లక్ష్మీబాయి, లక్ష్మీ సెహగల్ తదితర వీరనారీమణుల జీవిత నృత్య రూపకం కట్టిపడేసింది. వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు కాగా, నేడు రూ.2.80 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. నాడు 1.30 కోట్ల ఎకరాలు సాగు కాగా, ఇప్పుడు 2 కోట్ల ఎకరాలు దాటిందని తెలిపారు. 22 వరకు రోజువారీగా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. వజ్రోత్సవ వేడుకల్లో అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దేశానికి తెలంగాణే ఆశాజ్యోతి: కేకే
తొలుత వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేకే మాట్లాడుతూ.. దేశం స్వాతంత్రోద్యమానికి 300 ఏండ్ల చరిత్ర ఉన్నదని వివరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోని కీలకఘట్టాలు ఇతిహాసాలకన్నా తక్కువేమీ కాదని తెలిపారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నదని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కొన్ని రాజకీయ శక్తులు భారతీయ సంస్కృతికి ప్రతీకలైన భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం సబ్బండవర్ణ్ణాలు, సబ్బండ జాతుల అభ్యున్నతికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని కొనియాడారు.