మన్సూరాబాద్, జూలై 16 : యాదగిరిగుట్ట ఆలయం ట్రస్టు బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించిన తండ్రీకొడుకులైన కాంగ్రెస్ నేతలు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి బేషరతుగా ఆ మాతృమూర్తికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. వారంరోజుల గడువు ఇస్తున్నామని, ఆలోపు క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
గురువారం హైదరాబాద్ చింతలకుంటలోని ఈశ్వరమ్మయాదవ్ నివాసానికి ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ వేర్వేరుగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఆమె ఓ ఆలయ బోర్డు సభ్యురాలిగా ఎంపికైతే జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అంత అక్కసు వెళ్లగక్కడమేమిటని ప్రశ్నించారు. యాదవ, గౌడ వర్గాలతోపాటు ఇతర బీసీలను అవమానిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, తాము తలచుకొంటే శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.