హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు భగ్గుమంటున్నాయి. సీఎం మా టలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిలదీయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోనున్నట్టు వివిధ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో సమావేశమైన నేతలు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కారు హామీల అమలును అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు విడుతల కరువు భత్యం పెండింగ్లో లేదు, పీఆర్సీ గడువు 7/23 నాటికి ముగిసింది. ఆరోగ్యకార్డులు చెల్లుబాటులో లేవు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నాయకత్వం వహించి, సమస్యల పరిషారానికి కృషిచేసిన పూర్వ నాయకులం సమన్వయ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించామని వివిధ సంఘాల నేతలు స్పష్టంచేశారు.