Kannaram School | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో అనేక చిత్రాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాల పాఠశాలలను ఒకసారి ఒక జిల్లాలో మరోసారి ఇంకో జిల్లాలో చూపుతుండటం గందరగోళానికి దారితీస్తున్నది. దానికి భీమదేవరపల్లి మండలంలో ఉన్న కన్నారం గ్రామమే ఉదాహరణ. ఈ గ్రామం హనుమకొండ, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్నది. జిల్లాల విభజన సమయంలో ఈ గ్రామాన్ని హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోకి మార్చారు. 2023 సెప్టెంబర్లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరిగినప్పుడు ఈ గ్రామాన్ని హనుమకొండ జిల్లాలో చూపించారు. తీరా బదిలీ అయిన ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో చేరేందుకు వెళ్తే సిద్దిపేట జిల్లా అని తెలిసి వెనక్కి రావాల్సి వచ్చింది.
ఆయనకు హనుమకొండ జిల్లాలో ఏ పాఠశాలనైనా కోరుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం మల్టీ జోన్-1లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు ప్రారంభమైనప్పుడు ఇదే కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాగా చూపించారు. అంతేగాకుండా అక్కడున్న స్కూల్ అసిస్టెంట్లకు అదనంగా 10 పాయింట్లు కేటాయించి రిలీవ్ చేశారు. వారిస్థానంలో సిద్దిపేట నుంచి మరో ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. తాజాగా మళ్లీ ఇదే పాఠశాలలోని పోస్టులను హనుమకొండ జిల్లాలో ఖాళీగా చూపుతున్నారు. ఈ పాఠశాలలో సిద్దిపేట జిల్లాకు చెందిన టీచర్లు పనిచేస్తుండగా, ఇప్పుడు హనుమకొండ జిల్లా అని చూపించడం గందోరగోళానికి తావిస్తున్నది. అధికారులు ఈ గందరగోళానికి తెరదించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇదే విషయంపై సిద్దిపేట జిల్లా డీఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.