Vijayashanti | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): విభజన సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సోమవారం ఆమె ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిషారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబుకు రహస్య అజెండాగా ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతున్నది.
తెలంగాణలో మళ్లీ టీడీపీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ బలపడదని స్పష్టంచేశారు. బీజేపీతో కలిసి బలపడేందుకు కుట్రలు చేస్తే టీడీపీతోపాటు బీజేపీ కూడా గల్లంతయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. అలాంటి కుట్రలు జరిగేతే తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలడం నిశ్చయమని పేర్కొన్నారు. పక్కా తెలంగాణ వాదిగా పేరున్న విజయశాంతి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె.. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఇలా బాహాటంగా బయటపెట్టడాన్ని తెలంగాణవాదులు స్వాగతిస్తున్నారు.