హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ‘ప్రీలాంచ్ ఆఫర్లో తక్కువ ధరకు ప్లాట్, ఫ్లాట్, విల్లాను సొంత చేసుకోండి. రెండు మూడేండ్లలో నిర్మాణం పూర్తవుతుంది. మీరు ఊహించని విధంగా ఈ వెంచర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడే బుక్ చేసుకుంటే రెండు మూడు రెట్ల తక్కువ ధరకు లభిస్తుంది. 3 నుంచి 5 శాతం మిత్తి గిట్టుబాటవుతుంది. మీతోపాటు మరో ఇద్దరు ముగ్గురు మీ స్నేహితులు, బంధువులు కూడా ప్రీలాంచ్లో బుక్ చేసుకున్నారంటే మీకు తక్కువ ధరకు ప్లాట్ వస్తుంది.
కొత్త వాళ్లను చేర్పిస్తే మీకు కమిషన్‌తోపాటు మరింత తక్కువ ధరకే ప్లాట్ లభిస్తుంది’ అంటూ రాష్ట్రంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డూ అదుపూ లేకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. వారి వలలో పడి అమాయకులు పెట్టిన పెట్టుబడుల్లో కొంత భాగాన్ని భూ యజమానులకు చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని పెట్టుబడిదారులను నట్టేట ముంచుతున్నారు. దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటి బాధితుల ఫిర్యాదు మేరకు సాహితీ ఇన్ఫ్రా, సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి.
సాహితీ ఇన్ఫ్రాపై హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ, ఏపీలోని విజయవాడ తదితర పలు ప్రాంతాల్లో 58కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణ వివిధ వెంచర్ల పేరుతో దాదాపు 2,500 మంది అమాయకుల నుంచి రూ.3 వేల చొప్పున వసూలుచేసి బిచాణా ఎత్తేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు వంకర బుద్ధితో అటు సాహితీ ఇన్ఫ్రా యాజమాన్యం నుంచి, ఇటు బాధితుల నుంచి భారీగా డబ్బు దండుకునేందుకు ప్లాన్ వేశాడు. దీనిపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయనతోపాటు బంధువులు, స్నేహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వర్‌రావును అరెస్టు చేయడంతో సాహితీ ఇన్ఫ్రా అక్రమాలపై దర్యాప్తు జరిపే బాధ్యతను మరో అధికారికి అప్పగించేందుకు కసరత్తు జరుగుతున్నది.
అమ్మిన ప్లాట్లనే మళ్లీ మళ్లీ అమ్ముతూ అమాయకుల నుంచి రూ.2.10 కోట్లు కొల్లగొట్టిన సాయి నిఖిత ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ యజమానులు బీబీనగర్‌లోని ‘బృందవన్-11’ లేఅవుట్లో తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తున్నామంటూ ఎంతో మంది నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో కేసు నమోదైంది.
ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భువనతేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. శామీర్‌పేటలో చదరపు గజానికి రూ.1,600 చొప్పున ధరతోనే ఇండ్లు నిర్మించి ఇస్తామని నమ్మించి దాదాపు 100 మంది అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అనంతరం ఆ సంస్థ బిచాణా ఎత్తేయడంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
శంకర్పల్లి మొకిలాలో ప్రీలాంచ్ పేరుతో ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్లో ఇచ్చిన ప్రకటనను చూసి నారాయణగూడకు చెందిన కే రాఘవేంద్రతోపాటు అనిల్ అనే మరో వ్యక్తి ముందుకొచ్చారు. చదరపు గజానికి రూ.4,500 చొప్పున విల్లాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారి నుంచి రూ.70 లక్షల చొప్పున మొత్తం రూ.1.40 కోట్లు అడ్వాన్సు తీసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాన్నీ చేపట్టలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు గుంటుపల్లి పద్మజ, గుంటుపల్లి అనూష, గుంటుపల్లి సమంత, ఈదర వంశీకృష్ణ చౌదరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది.
ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రియల్టర్లు చెప్పే మాయమాటలను ఎవరూ నమ్మరాదు. ఇండ్లు, ప్లాట్లను అమ్మే సంస్థల గత చరిత్రతోపాటు ఇతర అన్ని వివరాలను కొనుగోలుదారులు క్షుణ్ణంగా పరిశీలించాకే ముందడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతులున్న ప్రాజెక్టుల్లోనే ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేయాలి. ఇలాంటి సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే రెరా ద్వారా న్యాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఎలాంటి ప్రాజెక్టునూ చేపట్టని సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఒకేసారి 15 వెంచర్లు ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులకు రెరా, హెచ్ఎండీఏ అనుమతులు లేవు.
– శ్వేత, సీసీఎస్ డీసీపీ