హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఐదుగురిని హత్యచేసిన కేసులో దోషులుగా ఖరారైన ముగ్గురికి హైకోర్టు యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వారంతా నెలలో లొంగిపో వాలని ఆదేశించింది. అంబర్‌పేట్‌కు చెందిన దంపతులు ఖమరుద్దీన్, సాజిదాబేగం, వారి కుమారులు అబ్దు ల్లా బియాబిని, కిర్మాణి, కూతురు నేహా ఆఫ్రిన్లను హత్యచేసిన కేసులో నేహా ఆఫ్రీన్ భర్త జహంగీర్, అతని సోదరుడు సయ్యద్ కరీం, వారి బావమరిది జబ్బార్ హుసేన్ దోషులు గా తేలారు. జహంగీర్‌కు, నేహా ఆఫ్రీన్లకు 2008లో పెండ్లి జరిగిన 3 నెలలకే వారు విడిపోయారు. నేహా ఆఫ్రిన్ తన భర్త అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసు పె ట్టారు. ఆ కేసు విచారణకు జహంగీర్, అతని తల్లిదండ్రులు కోర్టుకు హాజరై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి జహంగీర్ తల్లి చనిపోయింది.
దీంతో జహంగీర్, అతని కుటుంబసభ్యులు 2010 మే 30న దాడి చేసి నేహా ఆఫ్రిన్, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను మారణాయుధాలతో హత్య చేశారు. ఈ ఘటనలో 9 మందిపై మృతుడి కోడలు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరి పేర్లే ఉన్నాయంటూ కేసు కొట్టేసిన కిందికోర్టు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పోలీసుల దర్యాప్తులో లోపం పేరుతో నిందితులను వదిలిపెట్టడానికి వీల్లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదని అభిప్రాయపడింది. ప్రధాన నిందితుడు జహంగీర్, అతని సోదరుడు, బావమరుదులకు యావజ్జీవ శిక్ష, రూ 20 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.