హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలైనా ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేదు. మిల్లర్ల సహాయ నిరాకరణ, ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంతో వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది. రెండు నెలల ముందే సిద్ధం చేయాల్సిన కొనుగోళ్ల పాలసీని ఇప్పటికీ ఖరారు చేయకపోవడం ప్రభుత్వ, పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. మిల్లర్లు, ప్రభుత్వం పంతానికి పోతుండటంతో రైతుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత వానకాలంలో 47 లక్షల టన్నులు, యాసంగిలో 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకే ఆపసోపాలు పడిన ప్రభుత్వం ఇప్పుడు 91 లక్షల టన్నులు ఏ విధంగా కొనుగోలు చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లర్ల సహాయ నిరాకరణ
సన్న ధాన్యం అంశంపై ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య పేచీ నడుస్తున్నది. సన్న ధాన్యానికి 67% బియ్యం ఇవ్వలేమని మిల్లర్లు చెప్తుంటే, ఇచ్చి తీరాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతున్నది. ఈ అంశంపై స్పష్టత ఇచ్చే వరకు తాము కొనుగోళ్ల ప్రక్రియలో పాల్గొనేది లేదని, ధాన్యం దించుకొనేది లేదంటూ మిల్లర్లు సహాయ నిరాకరణకు దిగారు. దీంతోపాటు మిల్లింగ్ చార్జీల పెంపు, కస్టోడియన్ చార్జీల పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మిల్లర్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఆయా సమస్యలపై ఇన్నాళ్లూ కాలయాపన చేసిన ప్రభుత్వం, తీరా కోతలు మొదలైన తరువాత ఈ నెల 5వ తేదీన నాలుగు మంత్రుల సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు ప్రధాన సమస్యలను గుర్తించిన మంత్రుల కమిటీ.. మిల్లర్లతో చర్చలు జరిపినప్పటికీ అడుగు మందుకు పడలేదు. అసలు సమస్యల గురించి చర్చించకుండా, ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మంత్రులు సమావేశాన్ని ముగించారు. దీంతో మిల్లర్లతో పంచాయితీ ఎటూ తేలలేదు. అక్టోబర్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు అందుకు తగిన ఏర్పాట్లు చేయకుండా, తీరుబడిగా అదే మొదటి వారంలో మంత్రుల కమిటీ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కమిటీ సమస్యలపై చర్చించేదెప్పుడు, వాటిని పరిష్కరించేదెప్పుడు, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేదెప్పుడు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పాలసీ లేదు.. గన్ని సంచులూ లేవు
మిల్లర్ల సమస్యకు తోడు పౌరసరఫరాల సంస్థ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం రైతులకు శాపంగా మారింది. ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అసలు ధాన్యం కొనుగోళ్ల పాలసీని ఖరారు చేయకుండానే ఏవిధంగా ధాన్యం కొనుగోలు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులను కూడా అధికారులు అందుబాటులో ఉంచలేదు. సుమారు ఏడు కోట్ల పాత గన్నీ సంచుల కొనుగోలు కోసం ఈ నెల 5న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విధంగా మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆలోపే పాలసీని, గన్నీ సంచులను సిద్ధం చేయకపోవడం, మిల్లర్ల సమస్యలను పరిష్కరించకపోవడం వరి కోతలు మొదలుపెట్టిన రైతులకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తుండటంతో పౌరసరఫరాల సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యాన్ని ఈ గోదాముల్లో నిల్వ చేయాలని భావిస్తున్నది. దీనివల్ల ధాన్యం దించుకోవడం, ఎత్తడం, నిల్వ చేయడం, పర్యవేక్షించడం వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.