TGMREIS | హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): అర్హతలు లేకున్నా సరే, నిబంధనలు వర్తించకున్నా ఫర్వాలేదు.. ఉన్నతాధికారులకు నచ్చితే చాలు అందలమెక్కిస్తారు. నచ్చిన పోస్టులో కూర్చోబెడతారు. ఇందుకు మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులంలో నియమించిన మెంటార్ పోస్టులే నిలువెత్తు నిదర్శనం. దీనిపై గురుకుల సంఘాలు మండిపడుతున్నాయి. అదీగాక ఇటీవల గురుకుల టీచర్ల నుంచి ఎలాంటి అప్లికేషన్స్ తీసుకోకుండానే నచ్చినవారిని ఎంపిక చేసి ఉత్తమ అవార్డులు ఇచ్చారని నిప్పులు చెరుగుతున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీలో సెక్రటరీ తప్ప ఇతర పోస్టుల్లో ఇప్పటివరకు ఎవరూ లేరు. 8నెలల నుంచి జేఎస్ పోస్టు ఖాళీగానే ఉన్నది. అకడమిక్ బాధ్యతలన్నీ కూడా విశ్రాంత ఉద్యోగితోపాటు, ఔట్‌సోర్సింగ్‌లో నియామకమైన మరో ఇద్దరు మాత్రమే నిర్వర్తిస్తుండడం కొసమెరుపు. వారిద్దరూ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ సొసైటీ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్లు సజావుగా కొనసాగకపోవడానికి, వేతనాలు సకాలంలో విడుదల కాకపోవడానికి సదరు ప్రైవేట్ వ్యక్తులే కారణమనే ఆరోపణలున్నాయి. ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా, మార్గదర్శకాలు పాటించకుండా తమకు నచ్చిన వారిని, మెప్పించిన వారినే ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారనే ఆరోపణలున్నాయి.
గతంలో ఏ సొసైటీలో లేనివిధంగా విజిలెన్స్ టీం, అకడమిక్ కో ఆర్డినేటర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు, సబ్జెక్ట్ రీసోర్స్‌పర్సన్స్(ఎస్ఆర్పీ) పేరిట మైనారిటీ సొసైటీ ప్రధాన కార్యాలయం లో డిప్యూటేషన్‌పై 40మందికిపైగా ఉద్యోగులను సొసైటీ నియమించింది. వారు డెమోల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతోపాటు పెత్తనం చెలాయించడం, ప్రశ్నించిన వారికి మెమోలు ఇచ్చి సస్పెండ్ చేయడం వంటి ఆరోపణలతో ఎస్ఆర్పీ వ్యవస్థను సొసైటీ గతంలోనే రద్దు చేసింది. అయితే ఇప్పుడు తిరిగి మెంటార్స్ పేరిట మళ్లీ పునరుద్ధరించేందుకు సొసైటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవంగా అధ్యాపకులు, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు పెంపొందించేందుకు, అందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మెంటార్స్‌ను నియమించడం ప్రధా న ఉద్దేశం. సొసైటీలో రెగ్యులర్ ఉద్యోగులై ఉండి, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీతోపాటు నెట్, సెట్ క్వాలిఫై అయిన వారికి, మైనార్టీ సొసైటీ క్యాడర్లలో బోధనానుభవాన్ని, మూడేండ్లపాటు పేపర్ల మూల్యాంకనం చేసిన అనుభవాన్ని, సైన్స్ ఫెయిర్లు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీలో భాగస్వాములైన, ఆసక్తి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా కనీస అర్హతలు, అనుభవం లేని, ఇంటర్ బోర్డ్ ఎగ్జాం పేపర్ ఎలా ఉంటుం దో తెలియని వారిని కూడా మెంటార్‌గా ఎంపిక చేశారని గురుకుల ఉపాధ్యాయు లు నిప్పులు చెరుగుతున్నారు. ఒక జాబ్ చార్ట్ లేకుండా, అప్లికేషన్ కాల్ ఫర్ చేయకుండా నచ్చిన వారిని మెంటర్‌గా నియమిస్తున్నారని, ఇదే కొనసాగితే సొసైటీ మొత్తం అప్రతిష్టపాలు కాకతప్పదని హె చ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్ద లు దృష్టి సారించాలని కోరుతున్నారు.