Telangana | తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏం చేసిండు? కరెంటు ఇచ్చిండు ప్రాజెక్టులు కట్టి నీళ్ల గోస తీర్చిండు ఎవుసాన్ని పండుగగా మార్చిండు సంక్షేమ పథకాలు అమలుజేసిండు.. అంతేనా?? కానేకాదు.. తెలంగాణ గడ్డమీద అక్షరాలా రూ.211 లక్షల కోట్ల సంపదను భూమి నుంచి పుట్టించిండు. ది మేం చెప్తున్న మాట కాదు.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిన గణాంకాలే..
ఐక్యరాజ్యసమితి, నీతి ఆయోగ్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ దేశాలు ఓ ఆదర్శ ప్రాజెక్టు, ఆచరణకు అన్ని విధాలుగా అర్హమైనదిగా ప్రశంసిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం గురించే ఇదంతా!
పుట్టిన గడ్డను, ప్రజలను రక్షించే వాడిని ‘నాయకుడు’ అంటారు.
భవిష్యత్తు తరాలు పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడమే కాదు.. దాని కోసం ఆచరణాత్మక కార్యక్రమాన్ని ఆత్మసాక్షిగా, త్రికరణశుద్ధితో నిర్వహించేవాడిని ఏమంటారు?
మహాత్ముడే కదా?!
‘హరితహారం’తో తెలంగాణలో స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించి, సమృద్ధిగా వానలు కురిసేలా చేసి, భూగర్భ జలాలను పెంచి.. భవిష్యత్తు తరాలకు లాభం చేకూర్చిన కేసీఆర్ మహాత్ముడు కాకపోతే, ఇంకెవరు??
‘హరితహారం’ భారతదేశ చరిత్రలో తెలంగాణ లిఖిస్తున్న ఆకుపచ్చని అధ్యాయం. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు, వానలు సమృద్ధిగా కురిసేం దుకు, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు, జనారణ్యంలోకి వస్తున్న కోతులు, ఇతర వన్య మృగాలను అడవుల్లోకి తిరిగి పంపించేందుకు మొక్కల పెంపకమే అసలైన విరుగుడు అని గుర్తించిన సీఎం కేసీఆర్.. ‘హరితహారం’ పేరిట 2015లో ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన తొమ్మిదేండ్లలో ఏటా సగటున 32 కోట్ల మొక్కలను నాటి ఇప్పటివరకు ఏకంగా 283.71 కోట్ల మొక్కలను పెంచారు. ఇది ప్రపంచంలోనే రికార్డు.
తండ్రిలా కాపాడి..
మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నాటిన వాటిలో కనీసం 85 శాతం మొక్కలు బతకాలని నిబంధన విధించారు. ఒకవేళ మొక్కలు చనిపోతే ప్రజాప్రతినిధులు, అధికా రులను బాధ్యులను చేస్తూ ఆదేశించారు.
ఒకే ఒక్క సిటీ హైదరాబాద్
పచ్చదనం పెంపులో హైదరాబాద్‌కు గ్రీన్‌సిటీ అవార్డు దక్కింది. లివింగ్ గ్రీన్ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డునూ హైదరాబాద్ దక్కించుకుంది. ఏఐపీహెచ్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ను ప్రదానం చేశారు. భారతదేశం నుంచి ఈ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క సిటీ హైదరా బాద్ కావడం విశేషం. హైదరాబాద్ నగరంలో పచ్చదనం 33.15 చ.కి.మీ నుంచి 81.81 చ.కి.మీ (246 శాతం) పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని 129 ప్రదేశాల్లో 188 ఫారెస్టు బ్లాక్‌లు అభివృద్ధి చేశారని, మొత్తం 1.6 లక్షల ఎకరాల భూమిని పునరుజ్జీవిం పజేశారని తెలిపింది.
అమెజాన్లోకన్నా తెలంగాణలో మిన్న
బ్రెజిల్లో అమెజాన్ అడవుల పునరుద్ధ రణ కోసం 7.3 కోట్ల మొకలను ఆరేండ్లలో నాటేందుకు కార్యాచరణ అమలు చేస్తు న్నారు. అదే తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే 283.71 కోట్ల మొక్కలను నాటారు. ఈ లెక్కన అమెజాన్‌లో ఒక్క ఏడాదిలో కోటి మొక్కలను నాటుతుండగా, తెలంగాణలో ఏటా 32 కోట్ల మొక్కలను నాటారు.
మొక్కల పెంపకానికి గ్రీన్ ఫండ్
హరితహారం కోసం బడ్జెట్ కేటాయింపులతోపాటు హరితనిధిని ఏర్పాటు చేశారు. దీనికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తోడ్పాటునందిస్తున్నారు. షాపులకు కొత్త లైసెన్సులు, రెన్యువల్, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో హరితనిధికి జమ చేస్తున్నారు.
తెలివిమంతుడి పని ఇట్లా ఉంటది!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాన్ని పొందడం తెలివిమంతుల లక్షణం. సీఎం కేసీఆర్ సరిగ్గా అదే చేశారు. ‘హరితహారం’ నిర్వహణ కోసం ఇప్పటివరకు రూ.10,822 కోట్లు ఖర్చుచేయగా, దాని ద్వారా రూ.211 లక్షల కోట్ల ఫలితాన్ని ఆర్జించిపెట్టారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత అంతకంతకూ పెరిగిపోవ డంపై 2021లో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఒక మొక్కను నాటితే రూ.74,500 సంపద సృష్టించినట్లేనని వెల్లడించింది. మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్, భూమిలో పోషకాల పెరుగుదల, వరదల నివారణ, వానలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొనే ఈ లెక్కగట్టినట్టు వెల్లడించింది. దీన్నిబట్టి గడిచిన తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కారు.. 283.71 కోట్ల మొక్కలను పెంచారు. అంటే రూ.211 లక్షల కోట్ల సంపదను తెలంగాణకు అందించారు.
15 రెట్లు ఎక్కువ
దేశంలో అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లో గడిచిన 9 ఏండ్లలో పరుచుకొన్న పచ్చదనంతో పోలిస్తే, తెలంగాణలో పచ్చదనం విస్తీర్ణం 15 రెట్లు ఎక్కువ.
ఎక్కడెక్కడ పెంచారు?
గ్రామం, పట్టణం, నగరం, రోడ్డు, కుంట, చెరువు, నది ఇలా.. ఎక్కడ అనువైన స్థలం ఉంటే అక్కడ మొక్కలు పెంచారు.
ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే..
తెలంగాణలో గ్రీన్ కవర్ 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగింది. 2015లో గ్రీన్ కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021 నాటికి అది 21,214 చ.కి.మీకు పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందున్నదని ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
హరితహారంతో తెలంగాణ సాగించిన కృషిని ప్రపంచం ప్రశంసిస్తున్నది. ఐకాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ-అర్బర్డే ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ గుర్తింపును హైదరాబాద్ నగరం 2020లో, 2021లో సాధించింది. హరితహారం ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా నిలిచింది.
నీతి ఆయోగ్ సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచీల్లో, (2020-21) అటవీకరణలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేసే ఉద్యానవన ఉత్పత్తిదారుల అంతర్జాతీయ సంఘం (ఏఐపీహెచ్) హైదరాబాద్ నగరానికి 2022లో గ్రీన్‌సిటీ అవార్డును ఇచ్చింది. హైదరాబాద్ అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగా గుర్తింపు పొందింది.
Haritha Haram2