హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్‌లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో బీసీ నేతలు పొన్నాల లక్ష్యయ్య, పొన్నం ప్రభాకర్, కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్, వీ హనుమంతరావు, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల కమిటీ సమావేశమవుతున్న నేపథ్యంలో ‘హలో బీసీ-చలో గాంధీభవన్’కు పిలుపునిచ్చారు. గాంధీభవన్ ముందు భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు.
సుమారు రెండు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి కొనసాగుతున్నది. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండేసి ఎమ్మెల్యే సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదనను పీసీసీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తరువాత సర్వేలు, చేరికలు, ఇతర కారణాలతో బీసీలకు ఇవ్వదల్చిన సీట్లలో కొత పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బీసీ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఐదు రోజులపాటు మకాం వేశారు. వారికి అధిష్ఠానం పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన బీసీ నేతలు అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు.
ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాల్సిందేనని గురువారం నాటి సమావేశంలో బీసీ నేతలు అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమవేశం అనంతరం బీసీ నేత కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ…‘అధిష్ఠానం మాట నెలబెట్టుకోవాలి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆమోదించిన ప్రకారం బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇస్తామంటే ఊరుకునేది లేదు. ఇది ముమ్మాటికి బీసీలను మోసం చేయడమే. సర్వేల పేరుతో బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి అనుకూలంగా సర్వేలు వస్తుంటే, దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నవారికి ఎందుకు అనుకూలంగా రావడం లేదు? ఇదేం విధానం?’ అని నిలదీశారు.