Meenakshi Natarajan | జనహిత పాదయాత్ర నుంచి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): పల్లెల్లో తిరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భావించారు. కానీ.. ఆమె ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు, శాపనార్థాలు, తమ పాలనా వైఫల్యాలు ఢిల్లీకి తెలిసిపోతాయని ప్రభుత్వ పెద్దలకు తెలిసిపోయింది. దీంతో మీనాక్షి సామాన్య ప్రజలతో కలవకుండా రక్షణ పేరుతో ‘రోప్’ కంచె వేసేశారు. ప్రజలకు, ఆమెకు మధ్య రెండుమూడు పొరలు ఏర్పాటుచేసి దిగ్బంధం చేశారు. సీఎం సన్నిహితవర్గం మొత్తం చుట్టూ చేరి తెలంగాణ పల్లెల కన్నీళ్లు ఢిల్లీకి చేరకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. శుక్ర, శనివారాల్లో జరిగిన పాదయాత్ర సాగిన విధానాన్ని పరిశీలిస్తే ఇది నిజమేనని సులభంగా అర్థం అవుతుంది. మీనాక్షి శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజక వర్గంలో, శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.
వలయంలో బందీగా మీనాక్షి
షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి, కనీసం 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దారి మధ్యలో తారసపడే సాధారణ ప్రజలు, రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి, ప్రభుత్వ పనితీరుపై వివరాలను సేకరిస్తారు. చీకటి పడేవేళకు ఏదో ఒక ప్రాంతానికి చెరుకొని, అక్కడే కార్యకర్తలతో మాటామంతి మాట్లాడుకుంటూ, పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే పల్లెను పరిశీలించి, గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేయాలి. ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలన ఎలా ఉన్నదని ప్రజలను అడిగి తెలుసుకొనేలా పాదయాత్రను రూపొందించారు. వాస్తవ పరిస్థితులు తెలిసిపోతే, ఆమె వాటిని ఢిల్లీ దాకా చేర్చే ప్రమాదం ఉన్నదని సీఎం సన్నిహిత వర్గం ఆందోళన చెందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆమెను కలవకుండా అడ్డుకున్నట్టు సమాచారం.
మొదట మీనాక్షి చుట్టూ సుమారు వంద మంది ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. పోలీసు పరిభాషలో దీనిని రోప్ పార్టీ అంటారు. ప్రజలెవరూ ఈ రోప్‌ను దాటి లోపలికి వెళ్లలేరు, ఇటు మీనాక్షి కూడా ఈ తాడులోపలే ఉండాల్సి వస్తుంది. డీఎస్పీ స్థాయి అధికారి దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాతి వరుసలో సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహిత వర్గం నిలబడినట్టు పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నేతలు వినయ్‌రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్, సుంకెట అన్వేష్‌రెడ్డి, ముత్యాల సునిల్‌కుమార్‌రెడ్డి ఇలా ఎగువశ్రేణి నేతలు చుట్టూ చేరి నడిచారు. పోలీసుల వలయం సేవలు అందిస్తున్నది. ప్రజలు, కార్యకర్తలు ఈ నేతల వలయాన్ని దాటి లోనికి వెళ్లని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా వెళ్లినా రోప్ పార్టీ పక్కకు తోసేస్తుంది. తద్వారా ప్రజలు మీనాక్షిని కలవకుండా దిగ్విజయంగా అడ్డుకున్నట్టు చెప్తున్నారు.
రెండు జిల్లాల్లో ఇదే వరుస
ఆందోల్‌లోని సంగుపేట ఫ్లై ఓవర్ నుంచి సాయంత్రం 6.02 గంటలకు యాత్ర తొలి అడుగు పడింది. 6.58 గంటలకు జోగిపేట పట్టణంలోని హనుమాన్ చౌరస్తాకు చేరుకున్నారు. మధ్యలో 8 నిమిషాలు ఆగి అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు చేసి నివాళులు అర్పించారు. 48 నిమిషాల్లో 6 కిలోమీటర్లు నడిచారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగింది. సరిగ్గా 6.15 గంటలకు తొలి అడుగు వేశారు. ఆలూరు చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర కాశీ హనుమాన్ వీధి, గోల్‌బంగ్లా, పాతబస్టాంగ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా రాత్రి 7 గంటలకు కికెట్ కొటార్మూర్కు చేరారు. మొత్తం 4.5 కి.మీ. దూరాన్ని 45 నిమిషాల్లో ముగించారు. ప్రజలెవరూ కలిసే అవకాశం లేకపోవడంతో పాదయాత్ర వేగంగా సాగిపోయినట్టు ముఖ్య నేతలు చెప్తున్నారు.
ప్రసంగంలోనూ అవమానమే
వేదిక మీద ప్రసంగం విషయంలోనూ మీనాక్షికి అవమానం ఎదురైందని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం. కాబట్టి ప్రొటోకాల్ ప్రకారం మీనాక్షి ముఖ్య అతిథి. సభా మర్యాదల ప్రకారం ఆమె చివరకు మాట్లాడాలి. అలా చేస్తే యాత్రకు ఆమె కేంద్రంగా మారుతుందనే ఆలోచనతో పెద్దల సన్నిహితులు ప్రోటోకాల్ లేకుండా నేతలతో మాట్లాడిస్తున్నారట. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడటం కనీస మర్యాద. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌లో ఆమె మాట్లాడిన తరువాత మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడటం కనిపించిందని అంటున్నారు. కార్యకర్తల సమావేశంలోనూ ఇదే పరిస్థితి. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు పలువురు తమ బాధలు చెప్పుకున్నారట. అయితే కార్యకర్తలు చెప్పిన వివరాలేవీ ఆమెకు అర్థం కాలేదు. దీంతో అడిగి తెలుసుకొనేందుకు తన పక్కన ఉన్న వారితో మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించటం స్పష్టంగా కనిపించింది. అయితే తెలుగును అనువదించి, హిందీ/ఇంగ్లీష్‌లో చెప్పేవాళ్లు ఆమె పక్కన లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. మీనాక్షి నటరాజన్‌ను పక్కన పెడుతూ అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ముందుకు వచ్చాడని కాంగ్రెస్ పార్టీ దిగువ శ్రేణి నాయకత్వం చెప్తున్నది.