హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత వస్త్రాలు, ప్రత్యేకించి ఇక్కత్ చీర నేత సాంకేతికత ఆస్ట్రేలియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫినాక్ట్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశ రాజధాని కాన్బెర్రాలో ఈ నెల 17 నుంచి 19 వరకు నేషనల్ మల్టీ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించారు. భారత్ నుంచి 31 సంస్థలను ఆహ్వానించారు. యాదాద్రి -భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన నేత కార్మికుడు శ్రీను గూడ ప్రదర్శించిన ఇక్కత్ చీర వర్క్ విశేషంగా ఆకట్టుకొన్నది. ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరి రాష్ట్ర ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా, శుభోదయం స్మార్ట్ వింగ్ ట్రావెల్స్ సంయుక్తాధ్వర్యంలో ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీటీ ముఖ్యమంత్రి ఆండ్రూ బార్, భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి రుచికా జైన్, ఫినాక్ట్ ప్రెసిడెంట్ శాంతిరెడ్డి, ఏసీటీ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ రజిత కొండా, మాజీ అధ్యక్షుడు స్టెయిష్ గాడే, అశోక్ గజం తదితరులు హాజరయ్యారు.