హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పాతకాలంలో వ్యవసాయంలో సాగు, పశుసంపద భాగంగా ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారుతూ వచ్చాయి. దీంతో సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్తూ రైతులు పశుపోషణకు దూరమయ్యారు. ఇలా మూలాలను మర్చిపోయి చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాతావరణంలో మార్పులు, పంటల సాగుపై అవగాహన లేకపోవడంతో పాడిపంటల విధానాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పాతకాలం నాటి విధానానికి శాస్త్రీయతను జోడించి ఆధునిక వ్యవసాయానికి ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. సమీకృత వ్యవసాయ సాగు విధానాన్ని అమలు చేసి రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలను అమలు చేస్తున్నది.
పాత కాలం నాటి పద్ధతులకు ఆధునికతను జోడించి సాగు నిర్వహణ విధానాలను ఆఫ్రికాలో ప్రయోగాత్మకంగా ఇక్రిసాట్ అమలు చేసింది. దీని కోసం 1,500 మంది రైతులను ఎంపిక చేసి పశుపోషణ-వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ఇందుకు సాగు వ్యర్థాలను పశువులకు దాణాగా వినియోగించేలా, శాస్త్రీయ పశుపోషణ, సాగు చేసేలా అవగాహన కల్పించింది. పంట వ్యర్థాల నిర్వహణ, దాణా మార్పిడితోపాటు పశువుల పేడను ఎరువుగా వినియోగం, ఎరువుల నిర్వహణ, బయోమాన్యూర్ తయారీ వంటి విధానాలపై శిక్షణ ఇచ్చింది. దీంతో రైతులకు అదనపు ఆదాయం పెరిగింది. రసాయన ఎరువుల భారం తగ్గింది.
ఈ విధానంలో పంటల దిగుబడి 30 శాతం పెరిగినట్టు, పశుపోషణతో 40 శాతం మేర అదనంగా ఆదాయం సమకూరినట్టు ఇక్రిసాట్ వెల్లడించింది. మాంసం వినియోగం కూడా పెరిగిందని వివరించింది. పశుగ్రాసం వృధా 30 శాతం నియంత్రణలోకి వచ్చినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరువు ప్రభావిత, వర్షాధార ప్రాంతాల్లో, చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా ఈ విధానాన్ని అమలు చేసే యోచనలో ఇక్రిసాట్ ఉన్నది.