హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల కోసం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతరలో వైద్య సదుపాయాలపై పబ్లిక్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను పరిశీలించారు.
ఇప్పటికే అమ్మవారి గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. దశలవారీగా మరో 30 శిబిరాలు, జాతర రూట్లలో మరో 42 క్యాంపులు ప్రారంభిస్తామని తెలిపారు.
అత్యవసర వైద్యసేవల కోసం మేడారం టీటీడీ కల్యాణమండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన దవాఖానను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జంపన్నవాగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వద్ద ఆరు పడకల సామర్థ్యంతో మినీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 3,199 మంది వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారని, షిఫ్ట్‌ల వారీగా 24 గంటలు సేవలందిస్తారని స్పష్టంచేశారు.