Congress Govt | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సర్కారు మాట విని సన్న ధాన్యం పండించిన రైతులకు చిక్కులు తప్పడంలేదు. బోనస్ దక్కుతుందో లేదో అనే ఆందోళన ఒకవైపు ఉంటే.. సన్నాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గందరగోళం నెలకొన్నది. ఊరికో కేంద్రం ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. మండలానికి ఒకటో రెండో కేంద్రాలను ఏర్పాటు చేసి మాటమార్చింది. దీంతో సన్నాలు పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు ఇతర గ్రామాల బాట పట్టాల్సిన పరిస్థితి. ఈ సీజన్లో 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేసిన అధికారులు ఇందుకోసం మొత్తం 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 7వేల కేంద్రాల్లోనే సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలను కలిపి ఏర్పాటు చేస్తారా? లేక అదనంగా ఏర్పాటు చేస్తారా? అనే అంశంపై సివిల్ సైప్లె నుంచి స్పష్టత లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఆ ఏడు వేలలోనే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తే.. సన్న ధాన్యం రైతులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మండల యూనిట్‌గా సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ధాన్యం అమ్మకాల్లో మళ్లీ పాత రోజులు పునరావృతం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రైతులు తమ ధాన్యం అమ్ముకునేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా రోజుల తరబడి అక్కడే ఉండి పంటను అమ్ముకొని వచ్చేవాళ్లు. ఇక వారి గ్రామం నుంచి మండల కేంద్రానికి ధాన్యం తరలించేందుకు రవాణా ఖర్చుల భారం రైతులపైనే పడేది. ఇప్పుడు సన్న ధాన్యం పండించిన రైతులు తమ ధాన్యం అమ్ముకోవాలంటే మండల కేంద్రానికో లేదా ఊర్లు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సన్న వడ్ల కొనుగోలుకు మండలానికి ఒకటి లేదా రెండు కేంద్రాల ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దొడ్డు వడ్ల మాదిరిగానే తమ ఊర్లోనే సన్న వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. సర్కారు ఇచ్చే బోనస్… రవాణా ఖర్చులకు, కొనుగోలు కేంద్రం ఉండేందుకు అయ్యే ఖర్చులకు సరిపోతుందని, ఇక తమకు ప్రభుత్వం ఏం మేలు చేసినట్టు అని రైతులు ప్రశ్నిస్తున్నారు.