హైదరాబాద్ : రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుముల( Anumula Constitution) రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలనని దుయ్యబట్టారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా నిర్వహించిన ప్రదర్శన ఆద్యాంతం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేశారని అభినందించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిసారీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని కేసీఆర్ అద్భుతంగా ఆకళింపు చేసుకొని తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు.
అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3, అంబేద్కర్ ఆలోచనా విధానం వల్లనే నేడు అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకుంటే ప్రయోజనం శూన్యమని ఆనాడే అంబేద్కర్ వెల్లడించారని తెలిపారు. సరిగ్గా అదే పరిస్థితి కేంద్రం, రాష్ట్రాల్లో కనిపిస్తున్నదని అన్నారు .

రాహుల్ గాంధీ తుక్కుగూడలో ఇచ్చిన న్యాయ పత్రం అన్యాయ పత్రంగా మారిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామన్న రాహుల్ గాంధీ వెనకనే ఫిరాయింపుదారులు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను సైతం ఉగ్రవాదుల్లాగా అరెస్టు చేస్తున్నారని వెల్లడించారు.

కోదాడలో కర్ర రాజేష్ లాకప్ డెత్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజేష్ దళితుడు కావడమే కాంగ్రెస్ పాలనలో ఆయన చేసుకున్న పాపమైందని పేర్కొన్నారు. దళితుడు అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పాలనలో దళితుడి లాకప్ డెత్‌పై ముఖ్యమంత్రి కానీ, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడలేదని ఆరోపించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ‘జెండా గద్దెలు కూల్చండి’ అంటూ ప్రజల్ని రెచ్చగొడుతూ శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను పాతిపెడుతున్నాడని దుయ్యబట్టారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని రేవంత్ రెడ్డి లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దేశాన్ని కదిలించారని వెల్లడించారు, వారి పోరాటానికి సుప్రీంకోర్టు కూడా కదిలి వచ్చి ఎంపవర్డ్ కమిటీని వేసిందని, ఈ వ్యవహారంలో రూ. 10 వేల కోట్ల భూమి కుంభకోణం జరిగిందని చెప్పిందని వెల్లడించారు. అయినా కేంద్రం ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదని పేర్కొన్నారు.