హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చిందని, పథకాలను ప్రభుత్వం ఎప్పట్నుంచి అమలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నిలదీశారు. శాసనసభలో సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఉహాగానాల నుంచి భూమ్మీదకు వచ్చి.. పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 లక్షల మంది యువతులకు కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారని నిలదీశారు.
కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది?
బడ్జెట్లో బీసీలకు రూ.20,000 కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,405 కోట్లు మాత్రమే కేటాయించిందని సునీతాలక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. రెండోవిడత గొర్రెల పంపిణీ, చేప పిల్లల ఉచిత పంపిణీ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చేనేత పరికరాలకు సంబంధించి 90 శాతం రాయితీ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పింఛన్‌ను రూ.4000కు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో మహిళపై అత్యాచారయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై క్రైమ్‌రేట్ 28 శాతం పెరిగిందని మండిపడ్డారు.
నాకే వినాలపిస్తలేదు..!
‘నాకే వినాలనిపిస్తలేదు.. మరి వాళ్లు (అధికార పక్షం) ఎట్లా వింటున్నారో నాకు తెల్వదు’ అంటూ స్పీకర్ ప్రసాద్ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతుండగా మైక్ కట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో సోమవారం సాయంత్రం శాసనసభలో మహిళా భద్రత అంశంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేపట్టిన పథకాలను, శాంతిభద్రతల పటిష్టతకు అనుసరించిన విధానాలను, రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాల గురించి సునీత వివరిస్తుండగా మైక్‌ను కట్ చేసిన సభాపతి మిగిలిన సభ్యులను చూపుతూ పై వ్యాఖ్యలు చేశారు.