హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో ప్రజలను వంచించే విధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని, కానీ నిబంధనలు, షరతుల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ.. ఈ నెల 27న ప్రియాంకగాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్న రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు రెండు గ్యారెంటీల్లోనూ అర్హులైన లబ్ధిదారులను తగ్గించేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని అన్నారు. రాష్ట్రంలో 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వాటిలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయని, అయితే ప్రస్తుతం 40 లక్షల మందికే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారని, మిగిలిన వారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. దానిలో కూడా ఏడాదికి 3 సిలిండర్లు మాత్రమే ఇస్తామని చెప్తున్నారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. వినియోగదారుడు మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకోవాలని, తర్వాత వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామనే నిబంధన కూడా సరికాదని పేర్కొన్నారు. బ్యాంకులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రంలో 1.31 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకునేవారు 1.05 కోట్ల మంది ఉన్నారని, కానీ ఇప్పుడు కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారని శ్రవణ్ విమర్శించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తు సౌకర్యం అన్నారని, ఎన్నికల తర్వాత నిబంధనల పేరుతో అర్హులను తగ్గించే కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా ప్రజలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని కోరారు.
సమ్మక, సారలమ్మ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారని శ్రవణ్ మం డిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, ఇది ప్రజలను మోసగించడం, తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. వీటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎప్పుడు పరీక్షలు పెట్టారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడారం అమ్మవారి సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని సీఎం అంటున్నారని, కరెంట్ కట్‌చేస్తే కొలువులు తీసేస్తా అని కూడా చెప్తున్నారని, ఆయన సీఎం కాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కనురెప్ప కొట్టినంతసేపుకూడా కరెంటు పోలేదని అన్నారు. రేవంత్ తన చేతకానితనాన్ని, అసమర్థతను చిన్న ఉద్యోగులపై నెడుతున్నారని మండిపడ్డారు. కరెంటు కోతలకు బాధ్యుడిగా ఆ శాఖ మం త్రి భట్టిని రేవంత్ సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. హామీలన్నీ అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.