ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10: యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశెనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయంలో ఎరువులతో పాటు పురుగుల మందులను (Pesticides) కూడా వాడాల్సి ఉంటుంది. పంట సాగు చేసినప్పటి నుంచి పెరిగే, కోత దశలో కూడా పురుగు, తెగుళ్లు సోకుతాయి. ఈ సమయంలో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకుని మందులను వాడితేనే మంచి ఫలితాలు, దిగుబడులు వస్తుంది.
కానీ, రైతులు ఎరువుల దుకాణాల యాజమానులు, పక్క రైతుల సలహాలు తీసుకుని మాత్రమే ఎరువులు, పురుగులు మందులు వాడుతున్నారు. దీంతో ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. తెగులు ఒకటైతే మరొక్క ఫెస్టిపైడ్ను వాడటం, మోతాదుకు మించి వాడటంతో దిగుబడుల్లో తేడాలు వస్తుంటాయి. ప్రతి సీజన్లో రైతులు ఇటువంటి పొరపాట్లు చేస్తూ పంట నష్టపోవడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా పురుగుల మందులు కొనుగోలు నుంచి వాటిని పంటలపై పిచికారీ చేసేంత వరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నదని వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
రైతులు తమ పంటపొలాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు వివిధ రకాల స్ప్రేయర్లు వాడుతారు. ఇందులో పవర్, కంప్రెషర్స్ప్రేయర్లు ఉంటాయి. పవర్ స్ప్రేయర్లు వాడకంలో మందు వినియోగం ఎక్కువ. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వీటి ద్వారా స్ప్రే చేస్తే పంటలోని ప్రతి భాగంపై మందుపడి పురుగులు, తెగుళ్లు తొందరగా చనిపయే అవకాశం ఉంటుంది. కంప్రెషర్ స్ప్రేయర్లతో పిచికారీ చేసినప్పుడు చిన్నచిన్న తుంపర్లుగా మాత్రమే పంటపై పడుతుంది. పవర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేస్తే పొగలాగా వ్యాపించి ప్రతిచోట పడుతుంది. రైతులు తెక్కువగా పవర్ స్ప్రేయర్లకే ప్రాధాన్యతనిస్తే మంచిది. అకేలా స్ప్రేయర్లు, చేతి పంపులు, కంప్రెషర్ పంపులతో ప్రయోజనం తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
వాణిజ్య పంటలతో పాటు కూరగాయల పంటలకు ఎక్కువగా పురుగుల మందులను వాడుతారు. ముఖ్యంగా వరి, పత్తి, మిరప, వేరుశెనగ, కంది, పొగాకు, బెండ, కాలీప్లవర్, క్యాబేజీ తదితర పంటలకు క్రిమిసంహారక మందులు అవసరం ఎక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులోనూ పురుగుల మందు అవసరం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూర పంటలపై మోతాదుకు మించి ఫెస్టిసైడ్స్ వాడితే ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించాలి.
పురుగుల మందుల వాడకం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పురుగుల మందుల ప్రభావానికి గురైన వాళ్లలో ప్రత్యుత్పత్తి, పెరుగుదలలో మార్పులు సంభవించడం హైపర్ యాక్టివిటీ, శరీర భాగాల మధ్య సమన్వయ లోపం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారటం, వికారం, వాంతులు, విరేచనాలు స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ మందులు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడితే పంటకు నష్టం. అవసరమైనంత మేరకే వాడాలి. పురుగుల మందులను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. వీటివల్ల భూమిలోని సారం తగ్గిపోయి భవిష్యత్తులో పంటలు పండే అవకాశం ఉండకుండా పోతుంది. మందులు పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. పంటకు ఏ తెగులు వచ్చిందో నిర్దారించుకుని అందుకు తగిన మందును ఎంపికచేసుకుని మాత్రమే ఉపయోగించాలి. పురుగుల మందును కలిపేటప్పుడు కూడా కొలతను విదిగా పాటించాలి. అప్పుడే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి.