కరీంనగర్ : మహిళలంటే సీఎం కేసీఆర్కు అపార గౌరవం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్న సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారత కోసం గొప్పగా కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూటపదహారు రూపాయలు కానుకగా అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
ఆడబిడ్డ కాన్పు కోసం కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల జన్మిస్తే రూ. 13వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ. 12 వేలు అందిస్తున్నామని, ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.