హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సంక్షేమభవన్లో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గర్భిణులు, కిడ్నీ బాధితులను దవాఖానలకు తరలించాలని సూచించారు. వరద ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్తు, తాగునీటి వసతులకు అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. గురుకులాలకు వరద ముంపు ఉన్నట్టు తెలిస్తే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం టేక్హోమ్ రేషన్ ద్వారా కొనసాగించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఏజెన్సీ ప్రాంతాలున్న పది జిల్లాల కలెక్టర్లు, నాలుగు ఐటీడీఏల పీవోలు పాల్గొన్నారు.