IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు మూడురోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని.. గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలు, గనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉండొచ్చని చెప్పింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఆకాశం స్పష్టంగా ఉంటుందని.. ఎండ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పింది.
ఇక దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని పేర్కొంది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. పలుచోట్ల 19వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది, కర్నాటక, కోస్టల్ ఏపీ, యానాంలో ఈ నెల 16 వరకు ఇదే పరిస్థితులు ఉండవచ్చని.. 17-18 తేదీల్లో లక్షద్వీప్‌లో ఉంటాయని చెప్పింది. రాబోయే నాలుగైదు రోజులు ఈ ప్రాంతంలో మెరుపులు, ఈదురుగాలులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. 17 వరకు కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్రలో వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత వర్షపాతం క్రమంగా తగ్గుతుందని భారత వాతావరణశాఖ వివరించింది.