హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ముందుగా రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదని.. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం పేర్కొన్నది. దక్షిణ భారతదేశంలో బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో దట్టమైన మేఘాలు ఏర్పడటానికి ప్రతికూలంగా మారిందని వెల్లడించింది.
ఉత్తర భారతదేశంలో నైరుతికి అనుకూలంగా ఉండటం వల్ల ఆయా రాష్ర్టాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నట్టు తెలిపింది. రైతులు ఈనెల 4వవారం వరకు పంటల సాగు కోసం ఎదురుచూడాలని సూచించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఈనెల 14వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7.68 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.