Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వాన కురుస్తుందని పేర్కొంది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత 24గంటల్లో తెలంగాణ జిల్లాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు సంగారెడ్డి, భూపాపల్లి, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 159 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.