హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి ముస్లిం సమాజమే తగిన బుద్ధి చెప్తుందని హైదరాబాద్‌కు చెందిన ఓ మసీద్ ఇమామ్ అబ్దుల్ మహ్మద్ షాంజీ హెచ్చరించారు. ‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లేకుంటే మీరు ఎందుకు పనికిరారు’ అంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆదివారం షాంజీ ఘాటుగా స్పందించారు. ముస్లింల ఓట్ల పునాదిపైనే కాంగ్రెస్ బతుకున్నదని ఫైర్ అయ్యారు. ముస్లింలపై రేవంత్‌రెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ముస్లింలు ఇజ్జత్‌తో బతుకుతారని, ఇందుకోసం చావనైనా చస్తారని కుండబద్దలు కొట్టారు. రేవంత్‌రెడ్డి.. ముస్లింల చరిత్ర తెలియని హీనుడని ధ్వజమెత్తారు. రేవంత్.. నీకు దమ్ముంటే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు పెట్టు.. నీ సీఎం సీటు గల్లవుతుందని సవాల్ విసిరారు. మరోసారి ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.