హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ (Syed Maqbool) మృతిచెందాడు. సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాది మక్బూల్ చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. అయితే మూత్రపిండాలు దెబ్బతినడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చర్లపల్లి జైలు అధికారులు ప్రకటించారు.
అతనిపై దేశవ్యాప్తంగా పలు బాంబుదాడుల్లో సయ్యద్ మక్బూల్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్‌పై పోలీసులు అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అప్పటినుంచి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆనంద్ టిఫిన్స్తోపాటు రూట్ నంబర్ 107 బస్టాప్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 17 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును మూడేండ్లపాటు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్, మక్బూల్‌ను దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుడైన భత్కల్ పాక్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ బాంబులు తయారు చేసేవాడు. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి సన్నిహితుడిగా అతనికి పేరుంది. 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతోపాటు దిల్సుఖ్నగర్ పేలుళ్ల వెనుక అతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.


