సుల్తానాబాద్/ నర్సాపూర్ (జీ), ఏప్రిల్ 19: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 35 మంది, నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో పదిమంది భోజనం తరువాత అనారోగ్యం బారినపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులకు టిఫిన్‌లో బోండా వడ్డించారు. అది తిన్న వెంటనే విద్యార్థులకు కడుపులో మంట రావడంతో హెల్త్ ఆఫీసర్ ప్రాథమికంగా టాబ్లెట్లతో సరిపెట్టారు. సాయంత్రం వరకు తగ్గకపోవడంతో రాత్రి ఆటోలో 35 మందిని సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందులో 33 మంది కోలుకోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగా నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత పదిమంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వీరిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.